AP | కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో….

AP | కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో….
- మయున్మార్లో చిక్కుకున్న 27 మందిని దేశానికి
AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో.. మయున్మార్ దేశంలో చిక్కుకున్న భాదితులు తిరిగి భారత దేశానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచి ఉద్యోగ హామీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన సుమారు ఇరవై ఏడు మంది యువకులు కొద్ది నెలల క్రితం మయున్మార్ చేరుకున్నారు. అయితే ఇచ్చిన హామీ ఒకటి వారికి అక్కడ అందుతున్న ఉపాధి మరో రకంగా ఉండేది.
భాదితులు తెలిపిన వివరాల ప్రకారం వారికి మయున్మార్ లో తమను బలవంతపు సైబర్ స్కాం, శారీరక దుర్వ్యవహారాలు, ఇతర ఇబ్బందులకు గురి చేసారని తమ కష్టాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెంతకు వీడియో రూపంలో చేర వేశారు. తప్పుడు వాగ్దానంతో తమను మయున్మార్ తీసుకువెళ్ళారని, ఇప్పుడు సరిహద్దులో ట్రాఫికింగ్ అయ్యామని తమ గోడు చెప్పుకున్నారు.
వారి పరిస్థితి చూసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారికి ఉపశమనం కలిగేలా చర్యలు ప్రారంభించారు. మయున్మార్ లో చిక్కుకున్న 27 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ కు లేఖ రాసారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ, యాంగోన్లోని భారత రాయబారి కార్యాలయం వేగంగా చర్యలు తీసుకుని, శనివారం రోజున భాదితులను సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకొచ్చారు. శనివారం ఉదయం న్యూ డిల్లీకి చేరుకున్న బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు పూర్తి తోడ్పాటు అందించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా తిరిగి రాష్ట్రానికి రాబడ్డ వ్యక్తులు రాము గున్నుగుకెళ్లి, సాయి కుమార్ కనకవల, అజయ్ దుబ్బా, జగదీశ్ సాహు, బ్రహ్మాజి అలుగోలు, భువనేష్ గండబోయిన, దినేష్ గండబోయిన, ధనుంజయ రావు గువ్వల, చిను దీపక్ మొరదబూడి, శ్రీహర్ష అల్లు, జయకృష్ణ చటాల, జి. రామకృష్ణ, ఎస్.ఏ. నజ్మా బేగం, అరునేంద్ర మఠి, మస్తాన్ గగ్గుతూరి, జస్వంత్ కుమార్ రెడ్డి, చైతన్య కుమార్ రెడ్డి, జాయ్ విఘ్నాన్ సలగల, విజయ్ కుమార్ ఇసుకపాటి, సాయి నికేష్ దేవర, రమేష్ పల్లెబోన, రాకేష్ మంటి, తేజశ్వి తుంగ, మురళి, బి. చిన్న మల్లయ్య, ఎమ్. సుమ లక్ష్మి, జె.శేఖర్ బాబు లు కాగా వీరంతా విజయనగరం, విశాఖపట్నం, అన్నమ్మయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందివవారు. వారికీ వారి స్వస్థలాలకు వెళ్ళే ఏర్పాటును డిల్లి నుండి అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ భారతీయుని భద్రత, గౌరవం, శ్రేయస్సు కాపాడటానికి, కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటును అందిచేందుకు కూటమి సర్కారు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
