అల్లూరి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి: ఎస్పీ మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు, త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అన్నారు . మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యవంతం చేసి, వారికి నాయకత్వం వహిస్తూ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహోన్నత విప్లవ యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని కొనియాడారు.

దేశ స్వాతంత్ర్యం కోసం తన యౌవనాన్ని అంకితం చేసి, కేవలం 27 ఏళ్ల వయస్సులోనే అమరత్వం పొందిన అల్లూరి సీతారామరాజు త్యాగం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని తెలిపారు . విప్లవ పోరాటం ద్వారా స్వేచ్ఛను సాధించాలనే సంకల్పాన్ని దేశానికి చాటి చెప్పిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన దేశభక్తి, త్యాగనిరతి, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు నేటికీ సమాజానికి, ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిస్తున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు .ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్. శేషాద్రి, ఏవో సీ.హెచ్. గోపీనాథ్, సీఐలు ఈశ్వర్ ప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగరావు, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.