శ్రీకాకుళం డీపీఆర్వోగా జానకమ్మ బాధ్యతల స్వీకారం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లా పౌర సంబంధాల శాఖ (డీపీఆర్వో) అధికారిగా ఎస్. జానకమ్మ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డివిజనల్ పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు డీపీఆర్వోగా పదోన్నతి లభించడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్యాలయంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి కే. చెన్నకేశవరావు సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.

జానకమ్మ గతంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్వో), డివిజనల్ పీఆర్వోగా వివిధ హోదాల్లో సేవలందించారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై ఆమెకు ఉన్న విస్తృత అనుభవం, పరిపాలనా అవగాహన శాఖకు మరింత ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.