Bellampalle | బెల్లంపల్లి నుంచి అంతర్జాతీయ స్థాయి నాయకునిగా..

Bellampalle | బెల్లంపల్లి నుంచి అంతర్జాతీయ స్థాయి నాయకునిగా..
- ఎదిగిన రేణికుంట్ల శ్రీనివాస్ గుప్తా
- నేడు వాసవి క్లబ్ అంతర్జాతీయ అసోసియేటెడ్ ట్రెజరర్ భాద్యతల్లో
Bellampalle | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యుడైన రేణికుంట్ల శ్రీనివాస్ చిన్న తనం నుంచే నాయకత్వ లక్షణాలు, సేవా భావం, అంకితభావం ఉన్న వ్యక్తిగా ఎదుగుతూ వచ్చారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య సంఘం, పట్టణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పదవులు చేపట్టి అందరి మన్ననలు పొందారు. నేడు ఎవరూ ఊహించని రీతిలో రేణిగుంట్ల శ్రీనివాస్ వాసవి క్లబ్ అంతర్జాతీయ అసోసియేటెడ్ ట్రెజరర్ గా కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు.కుల మతాలకతీతంగా, పార్టీలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం ఆయన విధిగా చెప్పవచ్చు.
బయోడేటా :
బెల్లంపల్లి పట్టణంలో రేణికుంట్ల అనసూయ- హిమవంతు దంపతులకు మొదటి సంతానంగా రేణికుంట్ల శ్రీనివాస్ 1972 ఆగస్టు 8న జన్మించారు. విద్యాభ్యాసం బెల్లంపల్లి పట్టణంలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియెట్ హైదరాబాద్, డిగ్రీ కాకతీయ యునివర్సీటీలో చదివారు. రేణికుంట్ల శ్రీనివాస్ 1993 డిసెంబర్ 9న ఆసిఫాబాద్ లో ఉషారాణిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు సంతానం. వీరిలో పెద్దబాబు ప్రణయ్ బెంగుళూరులో, చిన్న బాబు వినయ్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

1985లో బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘంలో మొదటి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై, తరువాత కాలంలో ఎన్నో పదవులు అలంకరించి, 1996లో మొదటిసారిగా పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఆరు పర్యాయాలు (డబుల్ హ్యట్రిక్ ) పట్టణ యువజన సంఘం అధ్యక్షునిగా సేవలందించారు. వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం, వైశ్య భవన్ అండ్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్మించడంలో తన పాత్ర ఎనలేనిది. బెల్లంపల్లి పట్టణంలో ఆంధ్రరాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం, మహాత్మ గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలను ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల పేరు ప్రఖ్యాతులను శ్రీనివాస్ ఉమ్మడి జిల్లాలో విస్తరింపజేశారు. ఆతర్వాత వాసవి క్లబ్, బెల్లంపల్లిలో చార్టర్డ్ సెక్రటరీగా ప్రారంభమై ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, డిప్యూటీ గవర్నర్, 2013లో జిల్లా గవర్నర్ పదవులు అలంకరించారు. తరువాత వాసవి క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ గా అడిషనల్ ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, మల్టీపుల్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఉపాధ్యక్షులు వంటి ఎన్నో పదవులు నిర్వహించి ఆ పదవులకు వన్నెతెచ్చారు.
Bellampalle | ఉత్తముడిగా అనేక అవార్డులు…
రెండు సార్లు ఉత్తమ అధ్యక్షుడిగా వాసవి క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ గా, బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డులు పొందారు. లయన్స్ క్లబ్ లో కూడా ప్రెసిడెంట్ గా, మరెన్నో పదవులు నిర్వర్తించారు. అంతేకాదు బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయితీలోని బుగ్గరాజేశ్వరస్వామి దేవాలయం (దేవాదాయ శాఖ) చైర్మన్ గా పదవినలంకరించి 49 లక్షల రూపాయలతో కాలక్షేప మండలం నిర్మాణం చేయించారు. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం (దేవాదాయ శాఖ) చైర్మన్ 4 సంవత్సరాలు, సాంసృతిక కార్యక్రమాలతో పాటు దేవాలయం అభివృద్ధితో పాటు 24 లక్షల రూపాయలతో దేవాలయ ముఖ మండపాన్ని ఏర్పాటు చేయించారు. రేణికుంట్ల శ్రీనివాస్ ఎక్కువగా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలనే తపన, ప్రయాణం కొత్త పరిచయాలను పెంచుకోవడం అభిరుచి…. ఇలా చెప్పుకుంటూ పోతే….రేణికుంట్ల శ్రీనివాస్ సంపాదించుకున్న అవార్డులు ఎన్నెన్నో… రేణికుంట్ల శ్రీనివాస్ గౌరవ డాక్టరేట్లు రెండు సార్లు సాధించారు.
ప్రస్తుతం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 401ఎ మహారాష్ట్ర ఇంచార్జిగా, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులుగా, శ్రీ సరస్వతీ శిశు మందిర్ విభాగ్ సమ్యులుగా, హిందూ ఉత్సవ సమితి ఉపాద్యక్షులుగా, బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రత్యేక ఆహ్వానితులుగా పదవులు నిర్వహిస్తున్నారు.
