Telangana promotions controversy | ట్రెజరీ శాఖలో పదోన్నతుల వివక్ష

Telangana promotions controversy | ట్రెజరీ శాఖలో పదోన్నతుల వివక్ష

Telangana promotions controversy | ప్రభుత్వ శాఖల్లో వివాదాస్పద పదోన్నతులు, పెరుగుతున్న అసంతృప్తి
రెవెన్యూ శాఖలో నిబంధనల ఉల్లంఘన, అనధికార నియామకాలు
రిజిస్ట్రేషన్ల శాఖలో తాత్సారం, పెండింగ్ ఫైళ్లతో జాప్యం
సర్వీస్ రూల్స్‌పై సవాళ్లు, పరిపాలనా వ్యవస్థలో లోపాలు

Telangana promotions controversy | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. కొన్ని విభాగాల్లో జాప్యంతోపాటు, మరి కొన్ని శాఖల్లో పదోన్నతులు లేకుండానే నేరుగా ఉన్నతస్థాయి పోస్టులు కట్టబెట్టడం చర్చనీయాంశమవుతోంది. కొందరు అధికారులను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తూ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకపోగా, వారినే కీలక స్థానాల్లో ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. రెవెన్యూ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్లను డీఆర్వోలుగా నియమించడం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. రిజిస్ట్రేషన్ల శాఖలో ముగ్గురు గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాల్సిన ఫైల్ ఆమోదంలో తీవ్ర తాత్సారం జరుగుతోంది.

ఇదే శాఖలో ఇటీవలే పదోన్నతి పొందిన ఒక అధికారి నాలుగు పోస్టుల్లో కొనసాగడం కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో రంగారెడ్డి వంటి కీలకమైన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనులు పెండింగ్‌లో పడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జాయింట్ ఐజీగా ఉన్న అధికారి సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే శాఖలో రెండు పోస్టులకు కేడర్ స్ట్రెంగ్త్ ఉండగా నలుగురు అధికారులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన ఇద్దరిని ఇంకా కొనసాగిస్తూ మిగిలినవారి పదోన్నతులకు అడ్డం పడుతున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమళ్ల అశోక్‌ను ఏపీకి కేటాయించగా, సురేందర్‌నాయన్ను రెవెన్యూకు పంపాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. వారు ఇంకా రిజిస్ట్రేషన్ శాఖలో ఉండటంతో పదోన్నతులు పొందాల్సిన వారికి అడ్డుగా మారారు.


రెవెన్యూలో అనధికారిక పదోన్నతులు…

రెవెన్యూ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం 12 మంది తహసీల్దార్లను డీఆర్వోలుగా నియమించింది. వాస్తవానికి ఈ పోస్టుకు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అర్హులు. కానీ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇవేవీ పట్టించుకోకుండా తహసీల్దార్లను కలెక్టర్ తర్వాత స్థానంలో కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మండిపడుతున్నారు. జాబ్ చార్ట్, సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా పోస్టింగ్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవినీతి, అక్రమాల కేసులో జైలుకెళ్లి వచ్చిన ఓ తహసీల్దార్ ఇటీవల బదిలీల్లో జీహెచ్ఎంసీ ఉత్తర భాగంలోని ఓ కీలక ఏరియాకు తహసీల్దార్‌గా రావడం, నిబంధనలు అతిక్రమించి సొంత జోన్ కాకుండా మరో జోన్‌లో పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. సస్పెండ్ అయిన ఓ అధికారిని రీఇన్స్టేట్మెంట్ చేసిన రోజునే ప్రభుత్వం ఆమెకు కీలక జిల్లాలో ఆర్డీవోగా పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


పదోన్నతులకు నోచుకోని ట్రెజరీ అధికారులు

ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ (డీటీఏ) కింద పనిచేస్తున్న అధికారులకు ఐదేళ్లుగా పదోన్నతులు లేవు. ఇతర శాఖల్లో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ సాగుతున్నా తాము మాత్రం పదోన్నతులకు నోచుకోక వేతనాలు పెరగడం లేదని వారు వాపోతున్నారు. ఆర్థికశాఖ నిర్లక్ష్యం, నిబంధనలను ఖరారు చేయడంలో చూపిస్తున్న తాత్సారమే దీనికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.

Leave a Reply