kurnool | రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

kurnool | రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో భూ హక్కుల పారదర్శకత దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 141 గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామసభల ద్వారా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.

శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలిసి రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పాత భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన ఆధునిక పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిలో యజమాని పేరు, ఆధార్, మొబైల్ నంబర్, ఫోటో, సామాజిక హోదా వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉండి, స్కాన్ చేయగానే భూమి వివరాలు స్పష్టంగా తెలుస్తాయని వివరించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని అవలంబించాలని సూచించారు.

kurnool

ఈసందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులకు భూ హక్కులపై సంపూర్ణ భరోసా లభిస్తుందన్నారు. ఎలాంటి రాజకీయ గుర్తులు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. రీ సర్వే పూర్తైన గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, కల్లూరు మండలంలో ఐదు గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,216 పాస్ పుస్తకాలు, తడకనపల్లెలో 1,138 పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

kurnool

అలాగే అన్నదాత సుఖీభవం, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, దీపం, తల్లికి వందనం వంటి పథకాలు రైతులు, మహిళలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పారు. తడకనపల్లె చెరువును నీటితో నింపి సాగునీటి సౌకర్యం కల్పించినట్లు, పశువుల వసతి గృహాల ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ సందీప్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, సగర కార్పొరేషన్ డైరెక్టర్ రామ గిడ్డయ్య, సర్పంచ్ సహేరాబీ, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.జుబేదాబీ, తదితరులు పాల్గొన్నారు.

kurnool

Leave a Reply