Tirumala | మీ భద్రతే మా ప్రధాన ధ్యేయం..

Tirumala | మీ భద్రతే మా ప్రధాన ధ్యేయం..

Tirumala, ఆంధ్రప్రభ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తిరుపతి నగరంలో జిల్లా పోలీస్ ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా తనిఖీలు చేపట్టారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టులను పరిశీలించిన ఆయన, యువత ఉత్సాహంగా ఉండాలని కానీ అతి ఉత్సాహానికి లోనుకావద్దని హితవు పలికారు. వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే శాంతియుతంగా జరుపుకోవాలని, రోడ్ల పైకి వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించవద్దని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రోడ్ల పై కేక్ కటింగ్ చేయడం, అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేయడం, అశ్లీల నృత్యాలు లేదా అసభ్య ప్రదర్శనలు నిర్వహించడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడవద్దని స్పష్టంగా హెచ్చరించారు.

జిల్లాలో శాంతి భద్రతలు, ప్రజల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 64 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 80కి పైగా ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారి పై ఎలాంటి సడలింపులు లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అనుమతి లేకుండా ఈవెంట్లు లేదా డీజేలు నిర్వహించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

“మీ భద్రతే మా ప్రధాన ధ్యేయం” అనే నినాదంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పేర్కొన్న జిల్లా ఎస్పీ, జిల్లా ప్రజలు, మీడియా ప్రతినిధులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం–2026 శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు జిల్లావాసుల పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Leave a Reply