CITU | ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

CITU | ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
CITU | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లను తప్పుడు సమాచారంతో పోలీసులు అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాల్‌రాం తీవ్రంగా విమర్శించారు. ఆశా వర్కర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ‘చలో హైదరాబాద్’ లేదా ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాలు లేనప్పటికీ, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయనే కారణంతో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ పేరుతో జిల్లాలోని పలు మండలాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఆశా వర్కర్లకు ఫోన్లు చేసి, వారి ఇళ్లకు వెళ్లి విచారణలు చేయడం, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు పిలిపించి సంతకాలు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ, పోలీసులు వినకుండా ఆశా వర్కర్లను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అనవసర చర్యగా పేర్కొన్న ఆయన, వెంటనే ఇలాంటి వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండమీది బాల్‌రాం కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పనిచేస్తున్న ఆశా వర్కర్ల పట్ల గౌరవంతో వ్యవహరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
