PGRS Hall | దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి..

PGRS Hall | దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి..
PGRS Hall | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ హాలు వద్ద దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దివ్యాంగుల నుండి వినతులను జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ స్వీకరించారు. ప్రధానంగా దివ్యాంగులు కూర్చున్న కుర్చీల వద్దకే స్వయంగా జిల్లా కలెక్టర్ వెళ్లి వారి సమస్యలను సావధానంగా ఆలకించి, అర్జీలను స్వీకరించి, సమస్య పరిష్కారానికి అధికారులకు సూచనలు జారీ చేశారు.

ఇక పై ప్రతి నెల నాలుగో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి.. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. దివ్యాంగుల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జి.నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
