Mandali | కుంభాభిషేక మహోత్సవాలు..
Mandali | కుంభాభిషేక మహోత్సవాలు..
Mandali, చల్లపల్లి, ఆంధ్రప్రభ : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతి పొందుతున్న కమలాత్మికా సహిత అచలేశ్వర మందిరంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలోని కైవల్యాశ్రమ ప్రాంగణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చేస్తున్న కమలాత్మక సహిత అచలేశ్వర మందిరంలో నిర్భయానంద స్వామి శిష్య బృందం పర్యవేక్షణలో కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం ట్రస్ట్ ట్రస్టీ మేకా సత్యనారాయణ ప్రసాద్ (బంగారు బాబు) దంపతుల ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ వేడుకలకు గురువారం సాయంత్రం అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి కమలాత్మికా సహిత అచలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ప్రతిష్ట మహోత్సవానికి సిద్ధమై ధాన్యాధివాసంలో ఉన్న సదాశివమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి శివరుద్రస్వామి, విద్యాసాగర్ స్వామి, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా బంగారు బాబు దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు బొందలపాటి వీరబాబు, తిరుమలశెట్టి బాల నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ యడ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

