దొంగే దొంగ అన్న నానుడిని నిజం చేస్తున్న జగన్..

- పరామర్శ మరో పెద్ద డ్రామా..
- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్..
ఆంధ్రప్రభ, విజయవాడ : వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోజినగర్‌లోని 42 ఫ్లాట్ల పేరుతో చేసిన పరామర్శ యాత్ర ప్రజలను మభ్యపెట్టే మరో నాటకమే తప్ప… బాధితుల పట్ల నిజమైన ఆవేదన కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్ తీవ్రంగా మండిపడ్డారు.
పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్‌లోని 42 ఫ్లాట్ల వద్దకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిలో అధికారంలో ఉన్నప్పటి అహంకారంలో ఏ మాత్రం మార్పు లేదని బేగ్ అన్నారు. ప్రజలు స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, ఇప్పటికీ అబద్ధాలు, అపనిందలు, విషప్రచారంతోనే రాజకీయాలు చేయాలనే ధోరణి మారలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే, ఆ విజయాలను జీర్ణించుకోలేక జగన్ ఈర్ష్యతో విషం చిమ్ముతున్నాడని బేగ్ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో దేశ విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులు తీసుకొస్తుంటే, ఏం చేయాలో తెలియక జగన్ పిచ్చిపట్టి… పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఘాటుగా విమర్శించారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పై చేసిన వ్యాఖ్యలు జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని బేగ్ అన్నారు. దొంగలు, కబ్జాకోరులు, దోపిడీదారులను వెనకేసుకొని నిజాయితీగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులపై బురదజల్లడం సిగ్గుచేటని అన్నారు.
విజయవాడ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ… అనేక కీలక ప్రాజెక్టులను తీసుకొచ్చి, కుటీర పరిశ్రమల ద్వారా పేద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న చిన్నిపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని బేగ్ స్పష్టం చేశారు.
జగన్ వచ్చి ముసలి కన్నీరు కార్చినా, డ్రామా పరామర్శలు చేసినా, ప్రజలు మోసపోయే పరిస్థితి లేదని, జగన్ రాజకీయ స్క్రిప్ట్ పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు. 42 ఫ్లాట్ల అంశం ప్రస్తుతం న్యాయస్థాన పరిధిలో ఉన్నదని, కోర్టులో ఉన్న అంశంపై రాజకీయం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
బాధితులకు న్యాయం జరిగే వరకూ సహాయం అందిస్తామని ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారని గుర్తుచేశారు. కబ్జాకోరులను, దొంగలను, దోపిడీదారులను పక్కన పెట్టుకొని పేద ప్రజల అభ్యున్నతికే కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని బేగ్ డిమాండ్ చేశారు.
