BUILDING | నిర్లక్ష్యంగా వదిలేశారు..

BUILDING | నిర్లక్ష్యంగా వదిలేశారు..

  • నీరు గారుతున్న ప్రభుత్వ లక్ష్యం..
  • ప్రారంభానికి నోచుకోని రైతు వేదిక భవనాలు..
  • మంత్రివర్యా.. రైతు వేదిక భవనాలు ప్రారంభించండి.

BUILDING | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతలకు (Breadwinners) వివిధ పంటల సాగు పై నూతన మెలికలు నేర్పి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం లక్షలు వెచ్చించింది. రైతు వేదిక భవనాలు నిర్మించినా లక్ష్యం నెరవేరక ముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రైతు వేదిక భవనాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక్కో భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయగా వ్యవసాయ శాఖ రూ. 12 లక్షలు, మొత్తం రూ 22 లక్షలతో 2021 లో ప్రభుత్వంనిధులు మంజూరు చేయగా భవనాలు నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో భవనాలు మంజూరు కాగా మండలంలోని పెద్ద జట్రం, పెద్దపొర్ల, గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు.

రైతు వేదిక భవనాలు పూర్తయినా ప్రారంభించక పోవడంతో ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దజట్రం రైతు వేదిక భవన కిటికీలు ప్రారంభానికి ముందే విరిగిపోయాయి. భవనం సమీపంలోనే ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జనకు రావడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో పంటల సాగు పై రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు నిర్మించిన రైతు వేదిక భవనాలు ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Dr. Vakiti Srihari) ప్రత్యేక చొరవ తీసుకొని రైతు వేదిక భవనాలు ప్రారంభించి ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు రైతులు, వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.

భవనం ప్రారంభించి వసతులు కల్పించండి.


ప్రభుత్వం పెద్ద జట్రం గ్రామంలో రైతు వేదిక భవనం నిర్మించి ప్రారంభించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వ్యవసాయ విస్తరణ అధికారిని ఏ ఈ ఓ స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. భవనం (Building) చుట్టు పక్కల ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని అన్నారు. రైతు వేదిక భవనం చుట్టూ ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జనకు రావడంతో దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ చివరలో రైతు వేదిక ఉండడంతో కిటికీలు ధ్వంసం చేశారని కిటికీలో నుండి పాములు వస్తున్నాయని తెలిపారు. రైతు వేదిక భవనంలో మరుగుదొడ్లు మూత్రశాలలో ఏర్పాటు చేసి వెంటనే ప్రారంభించాలని కోరారు.

రైతు వేదిక భవనం వినియోగంలోకి తీసుకు రావాలి…


ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని వెంటనే ప్రారంభించాలని భాజాపా నాయకులు వాకిటి వెంకటేష్ డిమాండ్ చేశారు. రైతులకు పంటల సాగు పై అధికారులు సలహాలు సూచనలు ఇవ్వాలనే లక్ష్యంతో మోడీ (Modi) సర్కార్ రైతు వేదిక భవనాలు నిర్మిస్తే అధికార పార్టీ నాయకులు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పెద్ద జట్రం గ్రామంలో రైతు వేదిక భవనం నిర్మించిన ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా ఉండడంతో పాటు కిటికీలు విరిగి పోయాయని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి భవనం ప్రారంభించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.

Leave a Reply