నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు వద్దు

- జిల్లా అధికారులకు ప్రజల వినతి
మోత్కూర్, (ఆంధ్రప్రభ) : మున్సిపల్ కేంద్రంలో నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దని కోరుతూ స్థానిక నాయకులు జిల్లా రెవిన్యూ అధికారి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. నవీన్‌కుమార్‌లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పట్టణ కేంద్రంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల పౌరులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తాగిన మైకంలో కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాలయాలు, కళాశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండడం వల్ల విద్యార్థులు మద్యానికి బానిస అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రత, సామాజిక శాంతి కాపాడటానికి నివాస ప్రాంతాల మధ్య ఈ దుకాణాల ఏర్పాటు నిలిపివేయాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గుండగోని రామచంద్ర గౌడ్, కలిమెల నర్సయ్య, బుర్ర శ్రీను, మందుల సురేష్, ఎడ్ల నరేశ్, గుండు శ్రీను, బీసు మధు, శేఖర చారి, బొమ్మగాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
