రాజారాం పల్లెలో కిడ్నాప్ కలకలం..

రాజారాం పల్లెలో కిడ్నాప్ కలకలం..
ఎండపల్లి (ఆంధ్రప్రభ)
ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద కిడ్నాప్ ప్రయత్నం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంకను, ఆమె సొంత తల్లిదండ్రులే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్, ప్రియాంక గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోయినా ఇద్దరూ జూలై 2న ప్రేమవివాహం చేసుకున్నారు. రాకేష్ దళిత యువకుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహాన్ని అంగీకరించలేదు.
ప్రియాంక గర్భవతిగా ఉండగా, హాస్పిటల్‌లో చూపించాలని చెప్పి ఆమెను తల్లిదండ్రులు నమ్మించి తీసుకెళ్లారు. అయితే.. తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుని, వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో తన తల్లిదండ్రుల పై ఫిర్యాదు చేసింది. తనతో పాటు భర్త రాకేష్ ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రియాంక పోలీసులకు తెలియచేసింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
