2025 – తొక్కిసలాటల సంవత్సరం…

  • తిరుపతి నుంచి కాశీబుగ్గ దాకా
  • మొత్తంగా 80 మరణాలు
  • అరకొర సౌకర్యాలు.. భద్రతా లోపాలు
  • రద్దీని అంచనా వేయడంలో వైఫల్యాలు
  • ఎన్‌డీఎంఏ ప్రకారం 70 శాతం తొక్కిసలాటలు దేవాలయాల్లో
  • 22 ఏళ్లలో 3వేలకు పైగా మరణాలు
  • ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలతో దుర్ఘటనలకు చెక్‌

న్యూఢిల్లీ: భారతదేశంలో ఆలయాలు, ధార్మిక సమావేశాలు భక్తి, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా నిలుస్తాయి. అయితే, ఈ పవిత్ర స్థలాల్లో తొక్కిసలాటలు తరచుగా జరుగుతున్నాయి. ఇవి భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. నవంబర్‌ 1న శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు.

వీరిలో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన 2025లో ఆలయాల్లో జరిగిన అనేక తొక్కిసలాటల్లో ఒకటి. ఇవి యాదృచ్ఛికంగా కాకుండా అధిక జనసంఖ్య, దుర్బలమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి.

ఈ ఏడాదిలో తొక్కిసలాటలు

భారతదేశంలో తొక్కిసలాటల సంవత్సరంగా 2025 నిలిచింది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 6 మంది మరణించారు, డజన్ల మంది గాయపడ్డారు. జనవరి 29న ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య నాడు చోటుచేసుకున్న తొక్కిసలాటలో 40 మంది మరణించారు, 60 మందికి పైగా గాయపడ్డారు.

ఫిబ్రవరి 15న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాకు వెళ్తున్న వారిలో తొక్కిసలాటలో 18 మంది మరణించారు. మే 3న గోవాలోని షిర్గావ్‌ లైరై దేవి జాత్రాలో సన్నని రోడ్లు, అధిక రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 7 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారు.

జూన్‌ 29న పూరీ జగన్నాథ రథయాత్రలో రథాల వద్ద తొక్కిసలాటలో 3 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం 2025లో ఆలయాలు, ధార్మిక కార్యక్రమాల్లో 80కి పైగా మరణాలు, వేలాది మందికి గాయాలు నమోదయ్యాయి.

తొక్కిసలాటలకు ప్రధాన కారణాలు

భారతదేశంలో ఆలయ తొక్కిసలాటలు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) 2014 నివేదిక ప్రకారం, 70 శాతం తొక్కిసలాటలు ధార్మిక కార్యక్రమాల్లోనే జరుగుతున్నాయి. భారతదేశంలో జనాభా అధికంగా ఉండటం వల్ల తిరుమల, పూరీ లాంటి ఆలయాలకు రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తారు.

ఏకాదశి, కుంభమేళా వంటి సందర్భాల్లో ఇది మరింత పెరుగుతుంది. అధికారులు రద్దీని ముందుగా అంచనా వేయకపోవడం తొక్కిసలాటలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఉదాహరణకు, ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా సామర్థ్యం 1.5 లక్షలు మాత్రమే అయినా, 6.6 కోట్ల మంది హాజరయ్యారు. కాశీబుగ్గలో సాధారణ రోజుల్లో రోజుకు 5,000 మంది వస్తే, ఏకాదశి రోజున 25,000 మంది చేరారు.

దుర్బలమైన మౌలిక సదుపాయాలు

చాలా ఆలయాలు పురాతనమైనవి. సన్నని మార్గాలు, తక్కువ ఎగ్జిట్‌ పాయింట్లు ఉన్నాయి. తాత్కాలిక రైలింగులు, బ్రిడ్జీలు బలహీనంగా ఉంటాయి. నవంబర్‌ 1న కాశీబుగ్గలో ఐరన్‌ రైలింగ్‌ కూలిపోవడం దీనికి ఉదాహరణ. ఎన్‌డీఎంఏ ప్రకారం, రైలింగులు, సెక్టార్‌ పార్టీషన్లు లేకపోవడం వల్ల రద్దీ పెరుగుతుంది. గోవా లైరై దేవి జాత్రాలో సన్నని రోడ్లు దుర్ఘటనకు కారణమయ్యాయి.

కొన్ని సందర్భాల్లో పుకార్లు వ్యాప్తి చెంది ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తాయి. కుంభమేళాలో బ్రిడ్జ్‌ కూలుతుందని పుకారు రావడంతో 40 మంది మరణించారు. కమ్యూనికేషన్‌ లోపాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌లు లేకపోవడం ముప్పును మరింత తీవ్రతరం చేస్తాయి.

పోలీసులు, సెక్యూరిటీ స్టాఫ్‌ తక్కువగా ఉండటం, యాక్సెస్‌ కంట్రోల్‌ లేకపోవడం, వీఐపీ వాహనాలు మార్గాలను బ్లాక్‌ చేయడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, 2000–2022 మధ్య తొక్కిసలాటల వల్ల 3,074 మరణాలు సంభవించాయి, వీటిలో 70 శాతం దేవాలయాల్లో జరిగాయి.

పరిష్కారాలు, మార్గదర్శకాలు

ఎన్‌డీఎంఏ 2014 నివేదిక ప్రకారం, తొక్కిసలాటలను నివారించడానికి రద్దీని ముందుగా అంచనా వేసి, ఆన్‌లైన్‌ బుకింగ్‌/టికెటింగ్‌ పెంచాలి. వెడల్పైన మార్గాలు, బలమైన రైలింగులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలి. సీసీటీవీ, ఏఐ క్రౌడ్‌ మానిటరింగ్‌, పబ్లిక్‌ అలర్ట్‌ సిస్టమ్‌లు వినియోగించాలి.

పోలీసులు, ఆలయ అధికారులు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం పెంచాలి. వీఐపీ ప్రవేశాలు ఆపాలి. క్రౌడ్‌ డిసిప్లిన్‌పై భక్తులకు అవగాహన కల్పించాలి. ఈ ఏడాది చోటు చేసుకున్న తొక్కిసలాటలపై సంబంధిత ప్రభుత్వాలు దర్యాప్తులు చేపట్టాయి. భక్తికి, ఉద్వేగాలకు మధ్య ఆలయాల్లో చోటు చేసుకుంటున్న తొక్కిసలాటలు ప్రాణనష్టం కలిగిస్తున్నాయి.

ఇవి సిస్టమాటిక్‌ నిర్లక్ష్యం ఫలితంగా జరుగుతున్నాయి. ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా ఈ దుర్ఘటనలను తగ్గించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply