ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వండి..

  • భీమవరం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఐదు రోజుల్లో నీట మునిగిన పంటల వివరాలను సేకరించి పంట నష్టాలు నివేదికను సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పడిపోయిన పంట పొలాలు నీటా మునిగిన వరి చేల నుండి నీరు బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పంట నష్ట వివరాలు తెలుసుకునేందుకు రైతు సేవ కేంద్రాల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలను సేకరించాలని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ గూగుల్ మీట్ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏడీలు, ఎంఏవోలు పాల్గొన్నారు.