ఆన్ లైన్ షాపింగ్ లు…షాకింగ్ లు…
ఆన్ లైన్ షాపింగ్ లు…షాకింగ్ లు…
పండుగ సీజన్ అంటేనే సంతోషాలు, షాపింగ్‌లు...పండుగ వాతావరణాన్నిఆసరాగాచేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అమాయకులను మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటారు. పల్లెలు-పట్నాలలో అందరూ చాలవరకు ఆన్లైన్ షాపింగ్‌కు(to online shopping) బాగా అలవాటు పడిపోయారు.. “అత్యంత తక్కువ ధర” లేదా “పరిమిత కాల ఆఫర్” ఇలాంటి ప్రకటనలు కోకొల్లలు. వాటికి ఆకర్షితులయి, ఆఫర్ నిజమేనని నమ్మేసి, లింక్‌లపై క్లిక్ చేసేస్తున్నారు. వారి అతి విశ్వాసం, తొందరపాటు సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది.
యువత, టీనేజ్ వారితోబాటు పెద్దవాళ్లు కూడా క్రమంగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త సాంకేతికత(technology)పై పూర్తిగా అవగాహన లేకపోవడంతో అసలు వెబ్సైట్లకు-నకిలీ వెబ్సైట్లకు మధ్య వ్యత్యాసాన్నిగుర్తించలేకపోతున్నారు.
ఫోన్ ద్వారా వచ్చే నకిలీ ఎస్ఎంఎస్లను నమ్మి, తమ బ్యాంక్( banking) వివరాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. “వన్ ప్లస్ వన్ ఆఫర్(one plus one offer)” లేదా “100% క్యాష్‌బ్యాక్” లాంటి ఆకర్షణీయమైన ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపి, ఖాతాల్లోని సొమ్మును క్షణాల్లో దోచుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మోసగాళ్ల కొత్త పంథా..
సాధారణంగా పండుగలకు ప్రముఖ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు నకిలీ షాపింగ్ వెబ్సైట్లు, యాప్‌లను సృష్టిస్తున్నారు. ఈ నకిలీ సైట్ లు అచ్చం అసలు వెబ్సైట్(Website)లాగే కనిపిస్తాయి. బ్రాండ్ లోగోలు, రంగులు అన్నీ ఒకేలా ఉంటాయి. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈ నకిలీ వెబ్సైట్ల లింక్‌లను పంపి, ప్రజలను ఆకర్షిస్తారు.
ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే అది ఒక నకిలీ వెబ్‌సైట్‌కు దారి తీస్తుంది. అక్కడ మీరు ఒక వస్తువును ఆర్డర్ చేసినట్లు నమ్మించి, చెల్లింపు వివరాలను నమోదు చేయమని అడుగుతారు. మీరు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్(credit card) నంబర్, సీవీవీ, లేదా ఓటీపీ నమోదు చేయగానే, మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం క్షణాల్లో మాయమవుతుంది.
సరైన అవగాహన, అప్రమత్తతతోనే రక్షణ
సైబర్ మోసగాళ్ళు తమ వ్యూహాల(Strategies)ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉన్నప్పటికీ, కొన్నిసాధారణ లక్షణాల ఆధారంగా వాటిని సులభంగా గుర్తించవచ్చు. నకిలీ వెబ్సైట్లు అధికారిక సైట్‌ను పోలి ఉండేలా యూఆర్ఎల్(url)ను సృష్టిస్తాయి, కానీ చిన్నమార్పులు ఉంటాయి.
అలాగే, నకిలీ సైట్లు ఊహించనంతగా భారీ డిస్కౌంట్లు లేదా “100% క్యాష్‌బ్యాక్(100% cashback)” లాంటి నమ్మశక్యం కాని ఆఫర్లను ప్రకటిస్తాయి. గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చిన ఎస్ఎంఎస్లు, వాట్సాప్ లేదా ఈమెయిళ్లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఒకవేళ నిజంగా ఆఫర్ ఉందా అని అనిపిస్తే, అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి స్వయంగా తనిఖీ చేయాలి.
ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్(app store) నుండి డౌన్లోడ్ చేసుకున్న అధికారిక యాప్‌లనే వాడండి. ఏదైనా ఆఫర్ విపరీతంగా ఆకర్షణీయంగా అనిపిస్తే, అది నకిలీది అయ్యే అవకాశం ఎక్కువ. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, లేదా పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఏ బ్యాంక్ లేదా సంస్థ కూడా ఫోన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలు అడగదు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోసం జరిగితే….?
సైబర్ మోసానికి గురైతే, మొదటి 1-2 గంటలు అత్యంత కీలకం. దీనిని “గోల్డెన్ అవర్(golden hour)” అంటారు. ఈ సమయంలో వేగంగా స్పందిస్తే పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోసం జరిగిన సమయం, ఎంత డబ్బు పోయింది, ఏ ఖాతా నుంచి బదిలీ అయింది, మోసగాళ్ల ఖాతా నంబర్ వంటి వివరాలు సేకరించాలి.
వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి ఖాతాను బ్లాక్ చేయమని లేదా లావాదేవీలను నిలిపి వేయమని చెప్పాలి. అలాగే, జాతీయ సైబర్ హెల్ప్‌లైన్(Cyber Helpline) నంబర్ 1930 కి కాల్ చేస్తే వారు డబ్బు బదిలీని నిలిపివేయడానికి సహాయ పడతారు. ఇది గోల్డెన్ అవర్‌లో అత్యంత కీలకం.
ఫిర్యాదు చేసేందుకు మార్గాలు
మోసానికి గురైతే సైబర్ క్రైం వెబ్సైట్ లోకి వెళ్లి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. “ఫైల్ ఏ కంప్లైంట్(File A Complaint)” ఆప్షన్ పై క్లిక్ చేసి, మోసం జరిగిన తీరును వివరించాలి. ఆన్ లైన్ ఫిర్యాదు చేయలేకపోతే, సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, క్రైమ్ నంబర్ ఇస్తారు. దీని ద్వారా కేసు పురోగతిని తెలుసుకోవచ్చు.
పండుగలు మన జీవితంలో ఆనందాన్ని నింపేవి. ఆ సంతోషాన్ని సైబర్ నేరగాళ్ల మోసాలు దూరం చేయకుండా ఉండాలంటే, మనం అప్రమత్తంగా ఉండాలి. టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగిస్తే, పండుగ షాపింగ్‌ను(Festive Shopping) సురక్షితంగా, సంతోషంగా పూర్తి చేసుకోవచ్చు.
