హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు ముఖ్యమంత్రితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయండి..
సినిమా కార్మికులు తమ సమస్యలపై చర్చించుకుని, వాటి పరిష్కారానికి ఏం కావాలో ప్రభుత్వానికి తెలియజేయాలని సీఎం సూచించారు. పరిశ్రమలో సానుకూల వాతావరణాన్ని దెబ్బతీసే సమ్మెలకు వెళ్లడం వల్ల రెండు వైపులా నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడుతుందని, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. కార్మికుల తరపున ప్రభుత్వం నిర్మాతలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం..
కార్మికుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. షూటింగ్‌లకు తెలంగాణ అనుకూలమని పేర్కొంటూ, చిన్న సినిమా నిర్మాతలతో సహా అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో చిత్రీకరణ జరుపుకోవడానికి అందరూ సహకరించాలని కోరారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం..
సినిమా కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవడం అవసరమని, ఇందుకోసం స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాలు చేపడతామని సీఎం తెలిపారు. నిర్మాతలు కూడా కార్మికుల నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని గతంలోనే కోరినట్లు గుర్తుచేశారు.
కార్మికులకు ఆరోగ్య బీమా, అవార్డులు..
గత పదేళ్లుగా సినిమా రంగంలో అవార్డులు ఇవ్వని విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వం సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను బహూకరించిన విషయాన్ని వివరించారు. అదే విధంగా సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారితో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

