కేంద్ర కమిటీ సభ్యుడు స‌హా..

చత్తీస్‌గఢ్ : మైన్‌పూర్ ప్రాంతంలోని అడవుల్లో ఎదురుకాల్పులు జ‌రిగాయి. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో 10మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ మేర‌కు అధికారులు తెలిపారు. భద్రతా దళాలు E30 యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) – CoBRA బటాలియన్ సంయుక్తంగా ఆపరేషన్‌ను నిర్వహించాయి. గత రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ ఇవాళ ఉదయం తీవ్ర కాల్పులతో ఉధృతమయ్యింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో భీకరమైన కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో 10మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. ప‌లు ఆటోమేటిక్ ఆయుధాలు, AK-47లు, INSAS రైఫిల్స్, SLRలు ఇతర ఆధునిక ఆయుధాలు కూడా భద్రతా దళాల చేతుల్లోకి వచ్చాయి.

ఈ ఎన్‌కౌంటర్‌‌లో మరణించిన వారిలో సీనియర్ మావోయిస్టు కమాండర్ మోడెం బాలకృష్ణ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కీలక మావోయిస్టు నాయకుడు కావ‌డంతో, అతని సమక్షంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఊపందుకున్నాయని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, మృతుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని అధికారులు అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో భద్రతా దళాలకు ఇది మరో ముందడుగు అని భావిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2025లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మరణించారు, ఇందులో బస్తర్ డివిజన్‌లో 208 మంది ఉన్నారు.

Leave a Reply