భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు..
జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు, ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న జుక్కల్ ప్రాంతంలో నాగుల పంచమి పండుగను మహిళల పండుగగా భావిస్తారు. పుట్టింటివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడపడుచులందరికీ కొత్త వస్త్రాలను బహుకరిస్తారు.
పండుగ సందర్భంగా మహిళలు, చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి పాముల పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాముల పుట్టలో పాలు, జొన్న పేలాలు, పుట్నాలు నైవేద్యంగా సమర్పించారు. వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు అధిక దిగుబడులు ఇవ్వాలని, పాడిపశువులు, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు.
