ఆక్వా రైతులను మోసం చేసినందుకా థాంక్స్..

  • ఆక్వా రైతులను మభ్య పెడుతున్న కూటమి ప్రభుత్వం
  • పాలకొల్లు సభపై ప్రసాదరాజు ఫైర్

నర్సాపురం, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంలో ఆక్వా రైతులు విలవిల లాడుతున్నారని, ఆక్వా రైతులకు ఏమి మేలు చేశారని కృతజ్ఞతలు తెలపాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండి పడ్డారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మంగళవారం పాలకొల్లు లో జరిగిన రాష్ట్ర ఆక్వా రైతుల కృతజ్ఞత సభలో రాష్ట్ర మంత్రులు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
అది కృతజ్ఞత సభ కాదని.. కృతగ్నత సభ అని వ్యాఖ్యానించారు. సంక్షోభం లో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా కుదేలు చేయడమే గాకుండా రైతులను మభ్య పెట్టే విధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు రోడ్డెక్కితే గానీ పట్టించుకొని కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఏమి మేలు చేసిందో చూపించాలని నిలదీశారు. రైతులకు నిజంగా మేలు చేస్తే అడగ కుండానే కృతజ్ఞతలు చెబుతారని, అడిగి చెప్పించుకునే అవసరం లేదన్నారు.

పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన ఆక్వా రైతుల మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతుల అందరికి రూ 1.50 పైసలకే సబ్సిడీ కరెంటు ఇస్తున్నట్లు జీ వో నెంబర్ 57 ఇస్తూ రూ 1100 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.ఆక్వా రైతులు రోడ్డు ఎక్కితే గాని స్పందన లేని ఈ ప్రభుత్వం గత జూన్ నెల 9 తారీఖున జీ ఓ 169 ద్వారా రూ 1.50 లకే విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని జీ ఓ ఇవ్వడం జరిగిందన్నారు.

మూడు నెలలకే రెండు జీ ఓ లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రైతులకు మేలు చేసే పరిస్థితి కన్నా రైతులని మోసం చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ లో పవర్ ఫ్యాక్టర్ నిబంధన ఉండటం వల్ల ఏ రైతు కూడా సబ్సిడీ రాకుండా ఆక్వా రైతు నష్టపోతున్నాడని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీ ఓ ప్రకారం పవర్ ఫ్యాక్టర్ నిరూపించుకోమని కోరుతున్నారు అనీ , పవర్ ఫ్యాక్టర్ 0.9-0.95 ఉంటే ఏ రైతుకి విద్యుత్ సబ్సిడీ రాదని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం విధానాలవల్ల రైతులకి లాభం కన్నా .. నష్టం ఎక్కువగా ఉందన్నారు. పవర్ ఫ్యాక్టర్ తప్పించుకోవాలి అంటే ప్రతీ ఆక్వా రైతు ప్రతి ఆరు నెలలకు కెపాసిటర్ వేసుకోవాల్సిందేనని తెలిపారు.

విద్యుత్ సబ్సిడీ గత వైఎస్ జగన్ ప్రభుత్వం నుండి కొనసాగుతుందని, ఇప్పుడు మీరేదొ కొత్తగా సబ్సిడీ ఇస్తున్నట్లుగా ప్రచారం చేయడం ఆక్వా రైతులని మోసం చేస్తున్నట్లేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొత్తగా నమోదు చేసుకున్న 12500 మంది రైతులకు రూ 1100 కోట్ల సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారని, గత వై ఎస్ జగన్ ప్రభువం రూ 3800 కోట్ల సబ్సిడీ రూపేణా ఆక్వా రైతులకు ఇచ్చిందని గుర్తు చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం ల అయిదేళ్లు రూ 1.50 కే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చామన్నారు.
2019-20 లో రూ. 577 కోట్లు
2020-21లో రూ. 843 కోట్లు
2021-22లో రూ .956 కోట్లు
2024-25 లో రూ .800 కోట్లు , సుమారు 50000 కనెక్షన్స్ కు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరిగిందని లెక్కలు చూపించారు.

సంవత్సరాని రూ 800-900 కోట్లు విద్యుత్ సబ్సిడీ గత వై ఎస్ జగన్ ప్రభుత్వం ద్వారానే రూ 1.50 కే విద్యుత్ సబ్సిడీ ఇవ్వటం జరిగిందని , ఈ ప్రభుత్వం 12000 కొత్త కనెక్షన్స్ గాను రూ 200 కోట్లు అదనంగా ఖర్చు పెడుతూ మేమే రైతులకు మేలు చేసామని ప్రచార ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు.

మేత రేటు రూ 12లు -రూ16 లు పెరిగితే ఈ ప్రభుత్వం నోరు మెదపలేదని, రూ 4లు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఫీడ్ యాజమానన్యం ప్రభుత్వ మాటను లెక్క చేయకుండా కేవలం రూ 2 లు మాత్రమే తగ్గిస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. పాలకొల్లు లో జరిగిన సభ ప్రచార ఆర్భాటం తప్ప… ఆక్వా రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు.

ఆక్వా యూనివర్సిటీ ని పట్టించుకొని ప్రభుత్వం..

తీరప్రాంత రైతులకు ప్రయోజనాలు చేకూరే విధంగా నరసాపురం నియోజకవర్గం లో దేశం లోనే రెండు ఆక్వా యూనివర్సిటీ గత వై ఎస్ జగన్ ప్రభుత్వం లో మంజూరు చేసి నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన ఆక్వా విధార్థులను తయారు చేసి ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. మూడో సంవత్సరం తరగతులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయలేదని ప్రసాదరాజు విమర్శించారు.