బ్రిటన్ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్‌ నాగరాజుకు ఘన సన్మానం

పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సింగిల్‌ విండో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సీనియర్‌ నాయకులు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌ నాగరాజు బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కు ఎన్నికైన సందర్భంగా నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్‌ మాజీ శాసనసభ్యుడు వొడితల సతీష్‌కుమార్‌ హాజరై ఉదయ్‌ నాగరాజును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనిగరం గ్రామానికి చెందిన వ్యక్తి బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కు ఎన్నికవడం తెలంగాణకు, ఉమ్మడి కరీంనగర్‌ ప్రాంతానికి, ముఖ్యంగా హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమని అన్నారు.

గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉదయ్‌ నాగరాజు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు, సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.

ఆయన విజయంతో శనిగరం గ్రామం, కోహెడ మండలం, హుస్నాబాద్‌ నియోజకవర్గం పేరు ప్రపంచస్థాయిలో మరింత మారుమోగాలని వారు అన్నారు.

ఈ పౌర సన్మాన కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీపతి రవీందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ మునిగడప శేషగిరి, మాజీ వైస్‌ ఎంపీపీ తంగేడ నగేష్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎల్తూరి స్వామి, బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు పాటి భగవాన్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉదయ్‌ నాగరాజుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.