నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై ఒరిగిన భారీ వృక్షం
వాహనదారులు, ప్రయాణికులకు పొంచి ఉన్న ప్రమాదం..
తొలగించాలని విజ్ఞప్తి
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ అటవీ ప్రాంతంలో నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షం ప్రమాదకరంగా ఒరిగిపోయింది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. రహదారి పక్కన ఉన్న భారీ వృక్షం పూర్తిగా రోడ్డుపైకి వంగిపోయి, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదకరంగా వేలాడుతోంది.
గాలి వీచినా, వర్షం పడినా ఈ భారీ వృక్షం కిందుగా వెళ్లే ప్రయాణికులు, వాహనాలపై కూలిపోయే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాహనదారులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా అటవీ శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని ఈ ప్రమాదకర వృక్షాన్ని తక్షణమే తొలగించాలని కోరుతున్నారు. ప్రయాణికుల రక్షణ, భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
