ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రావణ్‌బాబు తనిఖీలు
చిట్టినగర్, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రావణ్‌బాబు ఆదేశించారు. బుధవారం ఆయన చిట్టినగర్, కొత్తపేట డౌన్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఆయా కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల పనితీరు, సేవల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సేవలు అందుతున్నాయా లేదా అన్నదానిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా గుర్తించిన లోటుపాట్లను వైద్యాధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి వెంటనే సరిదిద్దుకోవాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి విభాగాన్ని నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి వైద్యాధికారి తమ పరిధిలోని ఆసుపత్రులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంతో పాటు, సిబ్బంది విధి నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని డాక్టర్ శ్రావణ్‌బాబు స్పష్టం చేశారు.
ముఖ ఆధారిత హాజరు నుంచి ప్రతి ఆరోగ్య కార్యక్రమం అమలు వరకు వందశాతం కచ్చితత్వంతో పనితీరు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను ఎప్పటికప్పుడు అధిగమించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిర్దేశిత ప్రమాణాలను పాటించకపోయినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
