పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. పలు జిల్లాల్లో స్వల్ప వ్యవధి పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 నిమిషాల పాటు తాత్కాలిక వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
రాత్రికి మరింత పెరగనున్న వర్ష ప్రభావం
తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
హైదరాబాద్‌లోనూ వర్ష సూచన
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ రానున్న 2 నుంచి 3 గంటల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో మరిన్ని వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని సూచించారు. వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
