మహారాష్ట్రలో విషాదం.. నివాస గృహాలపై విరిగిపడ్డ కొండ చరియలు

శిథిలాల కింద చిక్కుకున్న పలువురు..
ఇద్దరి మృతదేహాలు వెలికితీత

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని కుర్లా ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు జారిపడి సమీపంలోని నివాస గృహాలపై పడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, కొండ ప్రాంతాల్లో మట్టి బలహీనపడటం వల్లే కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా, వర్షాకాలంలో కొండ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.