చాణక్య నీతిలో ఆధ్యాత్మిక రహస్యాలు..
ఆహారానికి సనాతన ధర్మంలో ఉన్న ప్రాధాన్యత
భోజనం ద్వారా మనస్సుపై ప్రభావం ఎలా ఉంటుంది?
చాణక్యుడు నిరసించిన వారి ఇళ్లలో భోజనం ఎందుకు చేయకూడదు?
ఆహార శుద్ధికి పెద్దలు సూచించిన ఆధ్యాత్మిక మార్గాలు
ఆహారం, ఆలోచనలు, కర్మల మధ్య ఉన్న సంబంధం
మానవ పరిణామ క్రమంలోనూ, సనాతన ధర్మంలోనూ ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉపనిషత్తులు “అన్నం బ్రహ్మేతి వ్యజానాత్” (అన్నమే పరబ్రహ్మ స్వరూపం) అని చాటిచెప్పాయి. మనం తినే ఆహారం కేవలం మన స్థూల శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, మన సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చాందోగ్యోపనిషత్తు ప్రకారం, ‘ఆహారశుద్ధి సత్త్వశుద్ధి:’ మనం తినే ఆహారం ఎంత పవిత్రంగా ఉంటే, మన మనస్సు అంత శుద్ధిగా ఉంటుంది.
మహాత్ముడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో కేవలం లౌకిక విషయాలనే కాక, మానవ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన అనేక సూక్ష్మ రహస్యాలను కూడా వెల్లడించాడు. అందులో అత్యంత ముఖ్యమైనది ‘ఎవరి ఇంట్లో పడితే వారి ఇంట్లో భోజనం చేయకూడదు’ అనే నియమం. దీని వెనుక కేవలం సామాజిక కారణాలు మాత్రమే లేవు, అత్యంత లోతైన ఆధ్యాత్మిక, తరంగ, కర్మ సిద్ధాంత రహస్యాలు దాగి ఉన్నాయి.
ఎవరైనా ఒక వ్యక్తి భోజనాన్ని తయారు చేస్తున్నప్పుడు, దానిని సంపాదిస్తున్నప్పుడు వారి మనస్సులో ఉండే భావోద్వేగాలు ఆ అన్నంలోకి ప్రవేశిస్తాయి. అధర్మ సంపాదనతో, ద్వేషంతో, లేదా అసూయతో వండిన భోజనాన్ని మనం భుజిస్తే, ఆయా వ్యక్తుల పాప కర్మలు, నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల స్పందనలు) అన్నం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి, మన బుద్ధిని భ్రష్టు పట్టిస్తాయి.
అందుకే చాణక్యుడు కింది వ్యక్తుల ఇళ్లలో భోజనాన్ని ఖచ్చితంగా నిరసించాడు.
ఇతరులను మోసం చేసి, దొంగతనాలు చేసి లేదా లంచాలు మరిగి సంపాదించే వారి ఇళ్లలో భోజనం చేయరాదు. అధర్మ సంపాదన వెనుక ఎందరో బాధితుల కన్నీళ్లు, నిట్టూర్పులు, శాపాలు ఉంటాయి. అటువంటి సంపాదనతో కొన్న బియ్యం, వండిన అన్నంలో ‘కృత్య’ (నశింపజేసే ప్రతికూల శక్తి) ఉంటుందని భావించారు. ఆ అన్నాన్ని తిన్నప్పుడు మనలో ఉన్న సాత్విక గుణం నశించి, రాజస, తామస గుణాలు పెరుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి.
చెడు జరగాలని కోరుకునే వారి ఇంట్లో నీరు కూడా తాగకూడదు. ఒక వ్యక్తి మనకు ప్రేమతో వడ్డించినప్పుడు ఆ ఆహారం అమృతమవుతుంది. అదే శత్రుత్వంతో లేదా కుళ్ళుతో వడ్డించినప్పుడు, వారి మనస్సులోని విషపూరిత ఆలోచనలు ఆ ఆహారంపై ప్రభావం చూపుతాయని చెబుతారు. దీనిని సంస్కృతంలో ‘దృష్టి దోషం’ అంటారు. ఇది శారీరక రుగ్మతలకు, మానసిక అశాంతికి దారి తీస్తుందని నమ్మకం.
జంతువులను హింసించేవారు, ఇతరులను మానసికంగా లేదా శారీరకంగా పీడించి ఆనందించేవారి ఇంట్లో తినకూడదు. క్రూరత్వం ఉన్న వారి ఆరా (శక్తి వలయం) ప్రతికూల తరంగాలతో నిండి ఉంటుందని ఆధ్యాత్మిక భావన. వారు నివసించే గృహమంతా భయం, క్రోధం వంటి కంపనాలతో నిండిపోతుంది. అటువంటి వాతావరణంలో తయారుచేసే ఆహారం మనశ్శాంతిని దెబ్బతీస్తుందని చెబుతారు.
సత్ప్రవర్తన లేనివారు, వ్యభిచారులు, సమాజానికి చెడు చేసేవారి ఇంట్లో భోజనం నిషిద్ధం. ఆధ్యాత్మిక సాధనలో ‘బ్రహ్మచర్యం’, ‘పవిత్రత’ అత్యంత కీలకమైనవి. శారీరక, మానసిక పవిత్రత లేని వారి నుంచి వెలువడే తరంగాలు మన ప్రాణశక్తిని దిగజారుస్తాయని భావిస్తారు.
మనల్ని శత్రువుగా భావించేవారి ఇంట్లో లేదా మనకు చెడు జరగాలని కోరుకునే వారి ఇంట్లో భోజనం చేయకూడదు. అలాగే ఎంత సంపాదన ఉండి కూడా అనుభవించక, ఇతరులకు పెట్టడానికి ఇష్టపడని లోభి ఇంట్లో తినకూడదని చాణక్య నీతి చెబుతుంది.
పిసినారి వ్యక్తి ఎవరికైనా అన్నం పెట్టాల్సి వస్తే లోపల ఎంతో బాధపడతాడు. ఆ లోభం, అసంతృప్తి అనే భావాలు అన్నానికి అంటుకుంటాయని భావన. అటువంటి అన్నం తింటే మనలో కూడా సంకుచిత భావాలు, అభద్రతా భావం పెరుగుతాయని చెబుతారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి ఇంట్లో భోజనం చేయకూడదనే సూచన కూడా ఉంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. వ్యాధిగ్రస్తుల ఇంట్లో రోగకారక క్రిములు ఉండే అవకాశం ఒకటయితే, నిరంతరం వ్యాధి గురించిన బాధ, ఆందోళన వల్ల అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు.
మనల్ని పిలవకుండా వెళ్లిన చోట, లేదా మనల్ని తక్కువ చేసి చూపే వారి ఇంట్లో భోజనం ముట్టకూడదు. ఆత్మగౌరవమే ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు. ఎక్కడైతే గౌరవం ఉండదో, అక్కడ మన ప్రాణశక్తి కుంచించుకుపోతుందని చెబుతారు.
దానం చేయడం ద్వారా పుణ్యం ఎలా బదిలీ అవుతుందో, అలాగే ఒకరి ఇంట్లో భోజనం చేయడం ద్వారా వారి పాప పుణ్యాలలో కొంత భాగం మనకు సంక్రమిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. అందుకే సాధువులు, యోగులు ఎవరి పడితే వారి ఇళ్లలో భోజనం చేయరు.
అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో బయట భోజనం చేయాల్సి వచ్చినప్పుడు ఆహారంలోని దోషాలను తొలగించేందుకు పెద్దలు కొన్ని ఆధ్యాత్మిక మార్గాలను సూచించారు. భోజనం చేసే ముందు భగవద్గీతలోని “బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః…” శ్లోకాన్ని జపించి, ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలని సూచించారు.
ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులు కేవలం సమాజంలో ఎలా బతకాలో చెప్పే సూత్రాలు కావు. అవి మనిషిని ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చే మార్గదర్శకాలు. మన అంతరంగ సాధన నిరంతరాయంగా సాగాలన్నా, మనస్సు సత్త్వగుణంతో ప్రకాశించాలన్నా మనం తీసుకునే ఆహారం పట్ల అత్యంత జాగరూకతతో ఉండాలి.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
