దండెపల్లిలో ఆగని అక్రమ రేషన్ బియ్యం దందా

రేషన్ దుకాణాల వద్దే కొనుగోళ్లు..

అర్ధరాత్రి వేళల్లో వాహనాల్లో తరలింపు

దండెపల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం పేద ప్రజల ఆహార భద్రత కోసం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు ఆదాయ వనరులుగా మారిందనే ఆరోపణలు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దండెపల్లి మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందా రోజురోజుకూ విస్తరిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

స్థానికంగా కొందరు దళారులు, రేషన్ డీలర్లను చేతిలో పెట్టుకుని నేరుగా దుకాణాల నుంచే లబ్ధిదారులకు అందాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తక్కువ ధరకు అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు రాత్రి నుంచి ఉదయం వరకు బొలేరో, అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాల్లో తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అక్కడక్కడా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ మామూళ్లు అందజేసి అర్ధరాత్రి వేళల్లో చిన్న, పెద్ద సరుకు వాహనాల ద్వారా బియ్యాన్ని రహస్యంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ తనిఖీలు, దాడులు, కేసుల నమోదు వంటి చర్యలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు లక్ష్యం దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం అక్రమ మార్గాల్లో తరలిపోతే పేద కుటుంబాలకే నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలంటే అక్రమ రేషన్ బియ్యం కొనుగోలు, నిల్వ, రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడుతున్న దళారులు, వారికి సహకరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజల నుంచి సమాచారం స్వీకరించి, వేగంగా స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం నిజమైన లబ్ధిదారులకే చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.