చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి, శాస్త్ర, సాంకేతికతపై అవగాహన కల్పించడానికి, సైన్స్ పట్ల అభిరుచిని పెంచడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వి.మురళీ మోహన్ అన్నారు. జనవిజ్ఞాన వేదిక కొండపల్లి పట్టణ కమిటీ సమావేశం స్థానిక డాక్టర్ మోహన రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ లో జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ మామిడి సీతారామారావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు, విద్యా సంస్థల సహకారంతో చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది కూడా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 27న పాఠశాల స్థాయి పోటీలు, సెప్టెంబర్ 11న మండల స్థాయి, సెప్టెంబర్ 27న జిల్లా స్థాయి, నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు అర్హులన్నారు. ప్రతి తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని ఎంపిక చేసి ముగ్గురు సభ్యులతో మండల స్థాయి పోటీలకు పంపాలని సూచించారు. అనంతరం చెకుముకి సైన్స్ సంబరాలు – 2026 వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పి.కామేశ్వరరావు, ఎ.యలమందయ్య, ఎస్.వి.ఎస్.ఎస్.ప్రసాద్, ఎస్.కె.సర్దార్ సాహెబ్, సిహెచ్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
