మెగా డీఎస్సీని సమర్థంగా నిర్వహించాం: గద్దె రామమోహన్
పడమట, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీని ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 13వ డివిజన్‌కు చెందిన కొల్లి రెడ్డయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ భీమా పథకం కింద మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా రెడ్డయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అభాసుపాలవుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రూపాయి అవినీతికి కూడా తావులేకుండా మెగా డీఎస్సీని పూర్తి స్థాయిలో నిర్వహించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
కర్నూలులో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రతిపక్ష పార్టీ వైఖరిని నిరసించారని గద్దె రామమోహన్ పేర్కొన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగి ఉంటే ఆ విషయం వెంటనే వెలుగులోకి వచ్చేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని డీఎస్సీపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు తమ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించని, జాబ్ క్యాలెండర్ అమలు చేయని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మెగా డీఎస్సీని సమర్థంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కావాలనే డీఎస్సీపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ పీఏ కె.ఎన్.ఆర్.ను అరెస్టు చేసి రూ.20 కోట్ల నగదును సిట్ గుర్తించిందని, ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్‌సీపీ నేతలు డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. కార్యక్రమంలో నూతి శ్రీను, గద్దె ప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, షేక్ పిరోజ్, షేక్ నాగూర్, శొంఠి నాగేశ్వరరావు, గన్నే రవి, దూళిపాళ్ల రాజేష్, మాదిరెడ్డి రవి, శొంఠి సాయి, ముమ్మనేని మానస, చిట్టా నిర్మల, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు.
