ఆధ్యాత్మికతతో పాటు ప్రజాసేవే లక్ష్యం..
- షిరిడి సాయిబాబా ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి
- ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
చందర్లపాడు, ఆంధ్రప్రభ : కోనాయపాలెం గ్రామంలో నిర్వహించిన షిరిడి సాయిబాబా 11వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , భక్తులు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఘన స్వాగతం పలికారు. సాయిబాబా వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె భక్తులతో ఆప్యాయంగా మమేకమై, గ్రామ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
“శ్రద్ధ, సబూరి” అనే సాయిబాబా సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సేవాభావం, మానవతా విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలకు గౌరవం ఇస్తూనే నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
