అమరావతి చిత్రకళా వీధిలో కళాకారులకు సన్మానం
గుంటూరు, ఆంధ్రప్రభ: కళలు, సంస్కృతిని పరిరక్షించడంతో పాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు రింగ్‌రోడ్డులో నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళా ప్రదర్శనల్లో తమ ప్రతిభను చాటుకున్న కళాకారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ కళారూపాలను ప్రదర్శించిన కళాకారుల ప్రతిభను ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు అభినందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులు తమ సృజనాత్మకతతో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు, కళలు, సంస్కృతికి మరింత చేరువ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సంప్రదాయ కళారూపాలకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా కళాకారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. వివిధ కళా ప్రదర్శనల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్న కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కళలకు, కళాకారులకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నుంచి అవసరమైన ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
