రైతులకు మద్దతు ధర చట్టం చేయాలి..
- కార్మికులకు రూ.31 వేల కనీస వేతనం ఇవ్వాలి..
- ఉపాధి హామీని కొనసాగించాలి
- కదిరిలో రైతులు, కార్మికుల భారీ ర్యాలీ..
కదిరి రూరల్, ఆంధ్రప్రభ : రైతులకు మద్దతు ధర చట్టం చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కదిరిలో భారీ నిరసన చేపట్టారు. వందలాది మంది రైతులు, కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు.
కదిరి ఆర్అండ్బీ బంగ్లా నుంచి ప్రారంభమైన ర్యాలీ కాలేజీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఇందిరాగాంధీ సర్కిల్‌కు చేరుకుంది. అక్కడ రైతులు, కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పలువురు నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ రైతులు, కార్మికులు ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమం విజయవంతమైందన్నారు. ప్రజా ఉద్యమాలను పోలీసులు ఉపయోగించి అణచివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించేలా మద్దతు ధర చట్టం తీసుకురావాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసి దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. కదిరి పట్టణంలో అండర్‌డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కదిరి, నల్లచెరువు, తనకల్లు మండలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కదిరి పట్టణంలో బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాంబ, బాబ్జాన్, ముస్తాక్, శివ, బాలకృష్ణ, జనార్దన్, సుజాత, లక్ష్మీదేవి, భాగ్యమ్మ, రాజేశ్వరి, రైతు సంఘం నాయకులు శివన్న, శ్రీరాములు, శంకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాగిరెడ్డి, సీపీఎం నాయకులు జగన్మోహన్, రామ్మోహన్, ఫాజిల్, కేవీపీఎస్ నాయకులు నారాయణ, కృష్ణానాయక్, రమేష్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాళ్లు శాంతిభాయి, జయశ్రీ, లక్ష్మీబాయి, హేమవతి, ఎస్ఎఫ్ఐ నాయకులు విజయ్‌కుమార్, హర్ష, అంజి తదితరులు పాల్గొన్నారు.
