రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణ పరిమితి పెంపు

  • రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన కేంద్రం
  • లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • సకాలంలో రుణం చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాలు
  • ఐదేళ్లలో వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాల కింద రూ.89,905.25 కోట్లు
  • జన్‌ సమర్థ్‌ ద్వారా కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల జారీ

విజయవాడ, ఆంధ్రప్రభ: రైతులకు వ్యవసాయ అవసరాల కోసం అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ) రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేసీసీ రుణాలు, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలు, జన్‌ సమర్థ్‌ పోర్టల్‌ ద్వారా కేసీసీల జారీ తదితర అంశాలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రూ.5 లక్షలకు రుణ పరిమితి..

2025-26 కేంద్ర బడ్జెట్‌లో సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కేసీసీ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన పెట్టుబడులు, స్వల్పకాలిక రుణ అవసరాలకు రైతులకు అదనపు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పేర్కొంది.

ఐదేళ్లలో రూ.89,905 కోట్లు..

సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అందించే ప్రోత్సాహకాలు, వడ్డీ రాయితీ కోసం గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం రూ.89,905.25 కోట్లు వెచ్చించింది. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం 2021-22లో రూ.21,476.93 కోట్లు, 2022-23లో రూ.17,997.88 కోట్లు, 2023-24లో రూ.14,251.92 కోట్లు, 2024-25లో రూ.17,811.72 కోట్లు, 2025-26లో రూ.18,366.80 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

జన్‌ సమర్థ్‌ ద్వారా నాలుగు రాష్ట్రాల్లో..

కేంద్ర బడ్జెట్‌ 2024-25లో చేసిన ప్రకటనకు అనుగుణంగా జన్‌ సమర్థ్‌ పోర్టల్‌ ద్వారా కేసీసీల జారీని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో పైలట్‌ ప్రాతిపదికన ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర సమాధానంలో పేర్కొన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేకపోవడం గమనార్హం. కేసీసీ ద్వారా రైతులకు సకాలంలో, సులభంగా రుణ సదుపాయం కల్పించడంతో పాటు వడ్డీ రాయితీ, సకాలంలో రుణ చెల్లింపులకు ప్రోత్సాహకాల ద్వారా రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది. పార్లమెంటులో రైతుల కేసీసీ రుణ అవసరాలు, రుణ పరిమితి, డిజిటల్‌ విధానంలో కార్డుల జారీ వంటి అంశాలను ఎంపీ కేశినేని శివనాథ్‌ ప్రస్తావించారు.