ఆపదలో మిత్రునికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు
ముదిగుబ్బ, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న తమ మిత్రుడికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు ముదిగుబ్బ జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు. 1991-92 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న మిత్రులు తమ సహచరుడు ఎం. హైదర్‌వలికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.
అనంతపురంలో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హైదర్‌వలి రెండు నెలల క్రితం విద్యుత్ షాక్‌కు గురై భవనం పైనుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న ఆయన పదో తరగతి సహచరులు మానవతా దృక్పథంతో స్పందించారు. అనంతపురం వెళ్లి హైదర్‌వలిని పరామర్శించి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో మిత్రుడికి అండగా నిలిచినందుకు పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఫకృద్దీన్, భాష, నాగేంద్ర, సుధాకర్ జగన్, హయత్, సురేష్, బాబు, ఫణి, సుధీర్, పుల్లారెడ్డి, గంగాధర్, కృష్ణ, షాషావలి, నాయుడు, నర్సింహులు, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
