ఆషాఢ సారెకు చివరి రెండు రోజులే..!

ఆగస్టు 12న ముగియనున్న ఆషాడ సారే ఉత్సవాలు..
భక్తులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సారె సమర్పించే వారికి ప్రత్యేక క్యూ లైన్‌
ముందుగా పేర్లు నమోదు చేసుకుని అనుమతి పత్రం పొందాలి
తెల్లవారుజామునే కొండ దిగువకు చేరుకోవాలని దేవస్థానం అధికారుల సూచన


(ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్న సారె సమర్పణ ఉత్సవాలు ఈనెల 12వ తేదీ బుధవారంతో ముగియనున్నాయి. దీంతో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించాలనుకునే భక్తులకు మరో రెండు రోజులే అవకాశం ఉంది. చివరి రోజుల్లో భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం నేపథ్యంలో దేవస్థానం అధికారులు పలు సూచనలు జారీ చేశారు.

నమోదుకు ప్రత్యేక కౌంటర్లు..
సారె సమర్పించాలనుకునే భక్తులు ముందుగా కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకుని అనుమతి పత్రం పొందాలని సూచించారు. సారె తీసుకువచ్చే భక్తుల కోసం రూ.100 భవానీ అనుగ్రహ దర్శనం క్యూ లైన్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. క్యూ లైన్లలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, లగేజీ బ్యాగులు, పాదరక్షలను అనుమతించరు. భక్తులు కొండపైకి వెళ్లే ముందే కనకదుర్గనగర్‌లోని ఉచిత ఆలయ డిపాజిట్‌ కౌంటర్లలో నిషేధిత వస్తువులు, చెప్పులను భద్రపరుచుకోవాలని అధికారులు తెలిపారు.

ఆలయ మర్యాదలతో అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తులో సారె సమర్పణ ఆశీర్వచనం కల్పించనున్నట్లు తెలిపారు. సర్వదర్శనాలు ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. చివరి రెండు రోజుల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు సమయం ఆదా చేసుకునేందుకు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యే కొండ దిగువకు చేరుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.