ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్నగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజలకే ప్రభుత్వం చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు నమ్మకంతో తమ సమస్యలను తమ ముందుకు తీసుకువస్తుండటం తమపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.ప్రతి వినతిని అత్యంత బాధ్యతతో స్వీకరించి సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ పరిష్కారం వచ్చే వరకు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
