141 మంది కళాకారులకు కళ్లజోళ్లు
- దృష్టి సమస్యలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
- ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, మరిన్ని సేవలకు శ్రీకారం
అమరావతి, ఆంధ్రప్రభ: క్రోచెట్ లేస్ కళాకారులు ఎదుర్కొంటున్న దృష్టి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాల అనంతరం దృష్టి లోపాలు ఉన్న 141 మంది కళాకారులకు కళ్లజోళ్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇటీవల విజయవాడలో నిర్వహించిన హస్తకళా మహోత్సవంలో కళాకారులతో మాట్లాడిన సందర్భంగా, నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి మహాలక్ష్మి తమ వృత్తి కారణంగా చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆ ఆదేశాల మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో 141 మంది కళాకారులకు కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించగా, వారందరికీ కళ్లజోళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అంతేకాకుండా పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో నిర్వహించిన మరో రెండు నేత్ర వైద్య శిబిరాల్లో దృష్టి సమస్యలు ఉన్న మరో 350 మంది కళాకారులను గుర్తించారు. వీరికీ కళ్లజోళ్లు అందించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అలాగే 20 మందికిపైగా కళాకారులకు కంటిశుక్లం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించగా, వారికి అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
హస్తకళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో మరో రెండు ఉచిత నేత్ర వైద్య శిబిరాలను త్వరలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి జీవనోపాధికి అవసరమైన సహాయాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

