క్రీడా కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరపాలి

మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు వినతి

విజయవాడ, ఆంధ్రప్రభ: 2017 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన క్రీడా కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు రాష్ట్ర క్రీడలు, యువజన, రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో సచివాలయాలు, పశుసంవర్ధక శాఖ, గ్రామ సచివాలయాలు, గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ-2025తో పాటు ఇతర శాఖల్లో జరిగిన క్రీడా కోటా నియామకాలపై పూర్తి స్థాయి విచారణ అవసరమని కోరారు. ఆర్టీఐ చట్టం కింద పేర్లు, క్రీడా విభాగం, మెరిట్, పాల్గొన్న ధ్రువపత్రాల వివరాలు కోరినా ఇప్పటి వరకు పూర్తి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

సచివాలయాల్లో క్రీడా కోటా కింద నియమితులైన 1,500 మందికి పైగా ఉద్యోగుల ఎంపికకు సంబంధించిన పూర్తి రికార్డులు, ధ్రువపత్రాలు అందుబాటులో లేవని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మంత్రిని కోరారు. క్రీడా కోటా నియామకాల విషయంలో కొంతమంది అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నందున సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వినతిపత్రంలో కోరారు.

ఈ అక్రమాల వల్ల నిజమైన క్రీడాకారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రాధాన్యత, స్థానికత తదితర అంశాలను సవాలు చేస్తూ సుమారు 35 మంది క్రీడాకారులు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారని, కొన్ని కేసులు పరిష్కారమవగా, మరికొన్ని తుది తీర్పు కోసం పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అర్హతపై అభ్యంతరాలు ఉన్న ప్రతి క్రీడాకారుడిని వ్యక్తిగతంగా పిలిచి వివరణ తీసుకోవాలని, అవసరమైతే అఫిడవిట్ పొందాలని, నిజమైన క్రీడాకారులు అన్యాయానికి గురయ్యారని తేలితే ఖాళీగా ఉన్న క్రీడా కోటా పోస్టుల్లో వారికి అవకాశం కల్పించాలని సూచించారు.

అలాగే సాప్ లో కొంతమంది ఉద్యోగులు ఐదు నుంచి 12 సంవత్సరాలకు పైగా ఒకేచోట కొనసాగుతున్నారని, వారి పాత్రపై కూడా విచారణ జరిపించాలని కోరారు. 2017–2025 మధ్య జరిగిన అన్ని క్రీడా కోటా నియామకాలు, ఎంపిక ప్రక్రియ, స్క్రీనింగ్ కమిటీలు, సంబంధిత అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధుల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని మంత్రిని వినతిపత్రంలో అభ్యర్థించారు. క్రీడా కోటా నియామకాలపై పారదర్శక విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చి నిజమైన క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని కె.పి.రావు పేర్కొన్నారు.