పెన్షన్‌లో కోత.. పోస్టుమ్యాన్‌ల జేబుల్లోకి రూ.16?

లబ్ధిదారుల ఆరోపణలు.. విచారణ చేపడతామన్న పోస్టాఫీస్ అధికారి

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందిస్తున్న పెన్షన్లు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమ్మర్‌పల్లి పోస్టాఫీస్ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయించిన పెన్షన్ మొత్తంలో నుంచి పోస్టుమ్యాన్‌లు ఒక్కో లబ్ధిదారుడి వద్ద రూ.16 చొప్పున తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి పేద వర్గాలకు జీవనాధారంగా నిలుస్తున్న పెన్షన్లలో కోత విధించడం అన్యాయమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు రావాల్సిన పూర్తి మొత్తాన్ని అందించకుండా తక్కువ నగదు ఇస్తున్నారని, ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పోస్టాఫీస్ ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతున్న గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి లబ్ధిదారులకే చేరాలని, మధ్యలో ఎలాంటి కోతలు ఉండకూడదని వారు కోరుతున్నారు.

ఈ ఆరోపణలపై పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై కమ్మర్‌పల్లి పోస్టాఫీస్ అధికారిని సంప్రదించగా, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.