కొత్తపాలెంకు 33 కేవీ అత్యవసర విద్యుత్ లైన్ ప్రారంభం

  • రూ. కోటి వ్యయంతో నిర్మాణం
  • విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం
  • రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ఆశాభావం

చిన్నగంజాం, ఆంధ్రప్రభ: చిన్నగంజాం మండలం కొత్తపాలెం ప్రాంత ప్రజల చిరకాల విద్యుత్ సమస్యకు పరిష్కారంగా రూ. కోటి వ్యయంతో నిర్మించిన 33 కేవీ అత్యవసర విద్యుత్ లైన్‌ను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఈ విద్యుత్ లైన్ అందుబాటులోకి రావడంతో కొత్తపాలెంతో పాటు పరిసర ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, కొత్త విద్యుత్ లైన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు సాగునీటి అవసరాలకు, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.