Guntur మేయ‌ర్ ప‌ద‌వికి కావ‌టి మ‌నోహర్ నాయుడు రాజీనామా

గుంటూరు కార్పొరేషన్, మార్చి 15 ( ఆంధ్రప్రభ ) : గుంటూరు నగర మేయర్ పదవికి కావట్టి శివ నాగ మనోహర్ నాయుడు రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ కు పంపించనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అవమానాలకు గురయ్యానని, కనీసం కార్పొరేషన్ అధికారులు తాను గుంటూరు నగరానికి ఒక ప్రధమ పౌరుడు ని అని మర్చిపోయి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర మనోవేదనకు గురైన తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నానని శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

గుంటూరు కార్పొరేషన్ లో ఉద్యోగి కొడుకునైన తాను అనేక దఫాలుగా కార్పొరేటర్ గా సేవలందించడం జరిగిందని, అలానే గుంటూరు మేయర్ గా నాలుగేళ్ల పాటు ఆ దేవుడి దయవల్ల, జగనన్న ఆశీస్సులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని మనోహర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుంటూరు నగరంలో కూడా అమలు చేస్తున్నారని, నయానో భయానో వైసిపి కార్పొరేటర్ లను బెదిరించటం, ప్రలోభాగాలుకు గురిచేయడం, మార్కెట్లో కూరగాయలనుకొన్నట్టు కొనడం వంటివి చేసి వారికి బలం లేదని తెలిసినా కూడా గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాలు కైవసం చేసుకున్నాను గొప్పలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

గుంటూరులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారనే దానికి నిదర్శనం మేయర్ స్థానంలో ఉన్న తనపై రెండు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పది లక్షల పైగా జనాభా ఉన్న గుంటూరు నగరానికి ప్రధమ పౌరుడిని అనే విషయం మర్చిపోయి కూటమి నాయకుల అండ చూసుకొని కార్పొరేషన్ అధికారులు అడ్డగోలుగా ఎవరు ఇస్తున్నారని దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదు అనేది అధికారులు మర్చిపోయినట్టు ఉన్నారని, కనీసం మేయర్ అనే చైర్ కి విలువ ఇవ్వరని, ప్రోటోకాల్ పాటించకుండా అవమానాలకు గురి చేయటం గుంటూరు కార్పొరేషన్ చరిత్రలో, రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చూసిన దాఖలాలు లేవని ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలోనే వెలుగు చూస్తున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కూటమి కార్పోరేటర్లకు గుంటూరు కార్పొరేషన్ లో సంఖ్యా బలం లేనప్పటికీ స్టాండింగ్ కమిటీ దక్కించుకున్నామని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, కేంద్ర సహాయ మంత్రి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి నయానో భయానో, ప్రలోభాలకు గురిచేసి, కొంతమందికి డబ్బు ఆశ చూపి మార్కెట్లో కూరగాయలు కొన్నట్టు కొనుగోలు చేసి గెలిచామని సంబరాలు చేసుకోవటం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.

అదే పందాలు ఈనెల 18వ తేదీన మేయర్ సీటు తగ్గించుకుంటామని కొంతమంది టిడిపి కార్పొరేటర్లు తనకు ఫోన్ చేసి చెప్పారని, అవును మేయర్ పదవి చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వం తరపున మేయర్ సీటు దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 17వ తేదీన స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం తనకు సమాచారం పంపించారని, వాస్తవానికి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సమావేశం ఎప్పుడు నిర్వహించాలి అనేది మేలైన నాకు హక్కు ఉందని, చట్టం మేయర్ కి ఆ అధికారాలు కల్పించిందని, అయితే తనకు తెలియకుండానే ఒక్కరోజు ముందు అధికారులు తనకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఉందని సమాచారం ఇచ్చి వెళ్లి పోవడం మేయర్ అయిన తనకే కాకుండా మేయర్ సీటుకు ఉన్న గౌరవాన్ని అగౌరవించినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం పూర్తయిన మరుసటి రోజు అంటే ఈ నెల 18వ తేదీన మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొని ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, సహచర కార్పొరేటర్లు చర్చించుకుని కుట్రలు చేస్తున్నారని తనకు సమాచారం అందింది అన్నారు. అయితే తనకు ఎటువంటి నష్టం లేదని దేవుడు ఆశీర్వాదంతో, జగనన్న ఆశీస్సులతో నాలుగేళ్లుగా గుంటూరు మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. తాను మేయర్ పదవిని మాత్రమే వదులుకోవడానికి సిద్ధమని… జగనన్నను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అందుకే వారు అవిశ్వాస తీర్మానం పెట్టే కంటే ముందే తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నానని, రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇకపోతే గతంలో కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు కమిషనర్ బుడమేరు వాగు వరద బాధితుల సహాయార్థం కార్పొరేషన్ సొమ్ము కోట్ల రూపాయల ఖర్చు చేసినట్టు చెప్పిన లెక్కల్లో భారీ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో, తమ అవినీతి అక్కడ బయట పడుతుందోనని అధికారులంతా కుమ్మక్కై అనేక అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను మేయర్ అయి ఉండి కూడా కార్పొరేషన్ లో తన చాంబర్ కి వెళ్తే తాళాలు వేసి ఉంటాయని, అరగంట తర్వాత అధికారులు వచ్చి హడావుడి చేస్తారని, ఒక మేయర్ గా అరగంట పాటు తనను గేటు ముందు నుంచో పెట్టడం ఎంత అవమానించడం అది వారి ఆలోచనకే వదిలేస్తున్నానన్నారు. అప్పట్లో కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ఆగిపోవడం, తానే ఒక అడుగు దిగి కమిషనర్ తో మాట్లాడి కౌన్సిల్ సమావేశం కొనసాగిద్దామని అనేక పర్యాయాలు సమాచారం పంపిన ఇప్పటివరకు కమిషనర్ స్పందించిన దాఖలాలు లేవన్నారు. కౌన్సిల్ సమావేశం ఎక్కడ పెట్టాల్సి వస్తుందోనని స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తెర పైకి తెచ్చారని, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ పూర్తయ్యాక అతను ఆగిపోయిన కౌన్సిల్ సమావేశం పెడదామని కమిషనర్ కు లేఖ రాయడం జరిగింది అన్నారు.

అయితే తనకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈనెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం అంటూ శుక్రవారం తనకు సమాచారం పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అండ చూసుకొని అధికారులు మేయర్ అయిన తనకు ఎటువంటి విలువ ఇవ్వట్లేదని, కనీసం ప్రోటో కాల్ కూడా పాటించటం లేదని, ప్రతి చోట అవమానాలకు గురిచేస్తున్నారని, ఇన్ని అవమానాలకు గురై ఈ పదవిలో కొనసాగటం తనకు అవసరమా అని భావించి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు మనోహర్ నాయుడు తెలిపారు.

ఇకపోతే పీవీకే నాయుడు మార్కెట్ పేరు మార్చాలని ఎంపీ, ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించినట్టు తనకు సమాచారం వచ్చిందని, అలానే ఆ మార్కెట్లో ఉన్న వ్యాపారుల అందరికీ న్యాయం జరగకపోతే తాను పోరాటానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. తాను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ప్రజల తరఫున పోరాడేందుకు ఎప్పటికీ సిద్ధమేనని మనోహర్ నాయుడు వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *