కొత్త చరిత్రకు నాంది: క‌ల్వ‌కుంట్ల కవిత

బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదామని పిలుపు
సరూర్‌నగర్ సంకల్ప సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’కు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రజలంతా ఒకే వేదికపై సంకల్పం చేస్తున్నారని తెలిపారు.

ఈ సభతో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నామని, ఈ మార్పు తెలంగాణ ప్రజల జీవితాలకే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఆమె పేర్కొన్నారు. సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

గౌతమ బుద్ధుడు చూపిన మార్గం, ఛత్రపతి సాహు మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన ఆశయాల స్ఫూర్తితో సమాజ శ్రేయస్సు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు.

సమాజంలో ఉన్న వనరులు ప్రతి వర్గానికీ సమానంగా అందే విధంగా వ్యవస్థ ఉండాలని, సామాజిక న్యాయం అనే అంశంపై అగ్రవర్ణ వర్గాలు కూడా విస్తృతంగా ఆలోచించాలని ఆమె సూచించారు. సమానత్వం, న్యాయం, భాగస్వామ్య అభివృద్ధే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.