22ndaprileditorial | చర్చలు విఫలమైతే యుద్ధ భయం..

22ndaprileditorial | చర్చలు విఫలమైతే యుద్ధ భయం..
22ndaprileditorial | శాంతి చర్చలకు ఇరు దేశాల సిద్ధత
ట్రంప్ హెచ్చరికలు – ఇరాన్ ప్రతిస్పందన
ఇస్లామాబాద్‌లో కీలక సమావేశ ఏర్పాట్లు
ద్విముఖ వ్యూహంతో ఇరాన్ అడుగులు
గల్ఫ్ దేశాలకు అమెరికా మద్దతు సంకేతాలు
నౌక స్వాధీనం – ఉద్రిక్తత మరింత పెరుగుదల
పరస్పర ఆరోపణలు – దౌత్య ఉద్రిక్తత కొనసాగింపు
చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది
22ndaprileditorial | అమెరికా–ఇరాన్ సంఘర్షణలో మలి విడత చర్చలకు రంగం సిద్ధమైంది. గాంభీర్య ప్రకటనలు, పరస్పర హెచ్చరికల నడుమ ఎట్టకేలకు ఇరు దేశాల ప్రతినిధులు శాంతి వైపు అడుగులు వేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు బుధవారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చర్చలపై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. మంచి ఒప్పందం కుదరబోతుందని సంకేతమిచ్చారు.
మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలు మోసపూరితమని పేర్కొంటూ, ఒత్తిడి తెచ్చి చర్చలకు రమ్మనడం సరైంది కాదని ఇరాన్ మొదట గట్టిగా స్పందించింది. అయితే, ప్రస్తుతం ఇరాన్ కొంత మెట్టు దిగినట్లు తెలుస్తోంది. సంఘర్షణకు ముగింపు పలకాలని భావిస్తోంది. తమ వద్ద బాంబులు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హెచ్చరించగా, యుద్ధాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలు, ఎత్తుగడలు సిద్ధం చేశామని ఇరాన్ ప్రకటించి ఉద్రిక్తతను మరింత పెంచింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ ఇస్లామాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. చర్చలు జరగాల్సిన ఇస్లామాబాద్‌లో భద్రతను పటిష్టం చేశారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రతినిధి పాల్గొంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమాహ్ తెలిపారు. అయితే, చర్చలు విఫలమైతే తాము ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ అవసరమైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.

ఇరాన్ ప్రభుత్వం ద్విముఖ వ్యూహంను అనుసరిస్తోందని ఆమె వివరించారు. ఒకవైపు దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాలని ఆశిస్తూనే, మరోవైపు తమ ప్రయోజనాలను ఏమాత్రం వదులుకోబోమని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులతో దెబ్బతిన్న గల్ఫ్ దేశాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. చర్చలు జరగకపోతే అందుకు ఇరానే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తున్న ఓ నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ నౌకలో ఆయుధాలు లేకపోయినా, క్షిపణుల తయారికి ఉపయోగించే రసాయనాలు ఉన్నట్లు సమాచారం. చర్చలకు రావాల్సిందేనని, ఇరాన్ తన ప్రతినిధులను పంపక తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ గడువును పొడిగిస్తారా అన్న ప్రశ్నకు, అలా చేయాలని తాను కోరుకోవడం లేదని తెలిపారు.
ఇక ఇరాన్ కూడా చర్చలు జరగకపోతే అందుకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటోంది. తమపై షరతులు విధించడం అన్యాయంమని ప్రశ్నిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీరు, కాదు మీరు అంటూ ఇరుదేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే, తటస్థ వర్గాలు మాత్రం ఈ పరిస్థితికి అమెరికాదే కారణంమని అభిప్రాయపడుతున్నాయి. అమెరికా ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తోందని, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. మొత్తం మీద, చర్చలు జరగాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తిగా అనుకూలంగా లేవు అని విశ్లేషకులు అంటున్నారు.
