పెద్ది సుదర్శన్ రెడ్డికి పంచాయతీ కార్యదర్శుల ఘన నివాళి
గ్రామాభివృద్ధిలో ఆయన సేవలు చిరస్మరణీయమన్న కార్యదర్శులు
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల నల్లబెల్లి మండల పంచాయతీ కార్యదర్శులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నర్సంపేట ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు.
గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేస్తూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పాటు డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పారిశుద్ధ్య వసతులు, పల్లె ప్రకృతి వనాల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఆయన మరణం నర్సంపేట నియోజకవర్గానికే కాకుండా గ్రామీణాభివృద్ధి రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరగా దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
