ఎమ్మెల్యే రాము చొరవతో.. స్పెషల్ బస్సు..

జనరల్ బస్సుల్లో విద్యార్థుల అవస్థలు…
5 రోజుల్లో స్పెషల్ బస్సు సర్వీస్ తెచ్చిన ఎమ్మెల్యే రాము
నందివాడ నుండి….గుడివాడ వరకు విద్యార్థులతో ప్రయాణించిన ఎమ్మెల్యే


నందివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో నందివాడ మండల విద్యార్థులకు స్పెషల్ స్టూడెంట్ బస్సు సర్వీస్ గురువారం ప్రారంభమైంది. గత శనివారం ప్రజావేదికలో విద్యార్థులు జనరల్ బస్సుల్లో ఖాళీ లేక పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, కేవలం ఐదు రోజుల్లోనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

కాలింగ్ పేటలో ప్రారంభమైన ఈ స్పెషల్ బస్సులో మండల కేంద్రం నందివాడ వద్ద ఎమ్మెల్యే రాము ఎక్కి విద్యార్థులతో కలిసి గుడివాడ వరకు ప్రయాణించారు. ప్రయాణంలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఎమ్మెల్యే, స్కూళ్లు కాలేజీల్లో వసతులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు ఇవ్వగా, ఎమ్మెల్యే చలోక్తులకు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. భవిష్యత్ లో ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు తన వ్యక్తిగత మొబైల్ నెంబర్ ను కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, “విద్యార్థులు చూపిన చైతన్యం వల్లే ఐదు రోజుల్లో ఈ బస్సు సమస్య పరిష్కారమైందన్నారు. ఇదే స్పూర్తితో మీ గ్రామాల్లోని ఇతర సమస్యలను కూడా అధికారులు లేదా నా దృష్టికి తీసుకురావాలన్నారు. “విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏమైనా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చదువులో మీరు రాణించాలంటే మౌలిక వసతులు తప్పనిసరని,అందుకే ముందుగా రవాణా సమస్యను పరిష్కరించాం” అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది అంటే అది నాకు ఇబ్బందే” అని స్పష్టం చేశారు.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే ఈ స్పెషల్ బస్సును ఏర్పాటు చేశామని, బస్సు సక్రమంగా నడవాలని, కాలింగ్ పేట నుండి గుడివాడ వరకు ఉదయం, సాయంత్రం ప్రతి స్టాప్ లో తప్పనిసరిగా ఆపాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కొద్దిమంది సాధారణ ప్రయాణికులకు కూడా ఈ బస్సులో అవకాశం ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు తమ హక్కులను సాధించుకునేందుకు చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. స్పెషల్ బస్సు ఏర్పాటుపై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు చెప్పారు.

ముందుగా నందివాడ సెంటర్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఎమ్మెల్యే రాముతో గ్రామస్తులు మాట్లాడారు. గ్రామ మెయిన్ రోడ్డుకి నిధులు మంజూరయ్యాయని… త్వరలో రోడ్డు పడుతుందని గ్రామస్తులకు ఎమ్మెల్యే రాము తెలపడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మరియు టిడిపి నాయకులు ఆర్టీసీ ఉద్యోగులు, పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు బస్సులో ప్రయాణించిన వారిలో ఉన్నారు.