ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
చౌటుప్పల్ సిఐ నందగిరి వెంకటేష్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మద్యం మత్తులో వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో స్థానిక ప్రజలు, ఆటో డ్రైవర్లకు, అలాగే కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ నందగిరి వెంకటేష్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు అతివేగాన్ని నివారించి పరిమితి వేగంతోనే ప్రయాణించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదకరమని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాదచారుల భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
