ఇంటి ఆవరణలో మంత్రించిన వస్తువులు వేశారని ఫిర్యాదు..

ఇంటి ఆవరణలో మంత్రించిన వస్తువులు వేశారని ఫిర్యాదు..
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : తమ గృహ ఆవరణలో మంత్రించిన రాళ్లు, పసుపు, కుంకుమ లాంటి వస్తువులు రాత్రి వేళలో పడవేస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి మంగళవారం ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్య గూడెం గ్రామానికి చెందిన కొప్పు గౌతమ్ కు చెందిన స్వగృహం ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, దారాలతో చుట్టిన రాళ్లను గృహ ఆవరణలో వదిలి వెళుతూ తమ కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.
పలుమార్లు ఇటువంటి చర్యలు చోటు చేసుకుంటున్నాయని తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
