హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపర్చాలి
- రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
- బాల్య వివాహాలు, రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచన
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, బాలసదనాలు, ఆసుపత్రుల్లో పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులను ఆదేశించింది. హాస్టళ్లలో మరుగుదొడ్లు, ఆర్‌వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇతర మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
సమీక్ష సమావేశంలో కమిషన్ ఛైర్మన్ మాట్లాడుతూ కడప జిల్లాలో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ విధానం విజయవంతమైందని, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో శ్రీకాంత్ జిల్లాలోని వైద్యసేవలు, సిబ్బంది వివరాలను కమిషన్‌కు వివరించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 30 వేల మంది 14–15 ఏళ్ల బాలికలకు అందించినట్లు తెలిపారు. బాల్య వివాహాల సమాచారం వెంటనే పోలీసులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కమిషన్ సభ్యుడు శ్రీనివాసమూర్తి సూచించారు.
సమావేశానికి హాజరైన బాలసదన్ విద్యార్థిని తనూజ తన వసతి గృహంలో పిల్లలకు తలపేలు సమస్య ఉందని వివరించడంతో, వెంటనే వైద్య బృందాన్ని పంపించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వోను కమిషన్ ఆదేశించింది. అలాగే బాలికను బీసీ హాస్టల్‌లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మాతృ మరణాలు, శిశు మరణాలు, ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరు, పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు, బాల కార్మికుల నిర్మూలన వంటి అంశాలపై కమిషన్ సభ్యులు అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. బాల కార్మికుల గుర్తింపు, తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల పరిశీలించిన బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్ల కొరత ఉందని గుర్తించామని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపి వెంటనే సమస్యను పరిష్కరించాలని కమిషన్ సభ్యులు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ అధికారులు హాస్టళ్లను తరచూ సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, పోక్సో కేసుల విచారణ, మహిళా–శిశు సంక్షేమ కార్యక్రమాలు, యువజన సంఘాల సేవా కార్యక్రమాలపై కూడా సమావేశంలో సమీక్ష జరిగింది. అనంతరం బాలికల భద్రతపై ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన పోస్టర్‌ను కమిషన్ సభ్యులు ఆవిష్కరించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, మహిళా–శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ శ్రీలక్ష్మి, కమిటీ సభ్యులు, జిల్లా విద్యాశాఖ, వైద్య, కార్మిక, మున్సిపల్, సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
