ఎరువుల కొరతకు చెక్
మైలవరం, ఆంధ్రప్రభ: మైలవరం నియోజకవర్గ పరిధిలోని మైలవరం, పొందుగల, అనంతవరం గ్రామాల రైతులు కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఎరువుల కొరత సమస్యకు పరిష్కారం లభించింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అవసరమైన ఎరువులను సమకూర్చి రైతులకు పంపిణీ చేశారు.
దశాబ్దకాలంగా ఎరువుల లభ్యత విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తాజా చర్యతో ఉపశమనం లభించినట్లు రైతులు పేర్కొన్నారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సొసైటీ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
మైలవరం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కరెడ్ల వెంకట నారాయణ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు అవసరమైన ఎరువులను అందజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల సరఫరా, పంపిణీ ప్రక్రియను సొసైటీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు.
రైతుల అవసరాలను గుర్తించి ఎరువుల కొరత సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. సాగు సమయంలో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగించాలని రైతులు కోరారు.
ఈ కార్యక్రమంలో మైలవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరీం దాదా, మండల పార్టీ అధ్యక్షుడు జోనిబోయిన గోపాలస్వామి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చారుగుండ్ల ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, మల్లెల రాధాకృష్ణ, యూనిట్ ఇన్‌చార్జి కరెడ్ల ఆంజనేయులు, తాళ్లూరి మధు, వైస్ ప్రెసిడెంట్ తోమ్మండ్రు ప్రేమసాగర్, మల్లెల దుర్గారావు, సొసైటీ డైరెక్టర్ ఒరుగు వెంకటేశ్వరరావు, సొసైటీ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.
